జానంపల్లి రామేశ్వరరావు


Contributors to Wikimedia projects

Article Images

రాజా జే.రామేశ్వర్ రావు (ఫిబ్రవరి 6, 1923 - సెప్టెంబర్ 15, 1998) వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు, పుస్తక ప్రచురణకర్త. 1949లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరాడు. వివిధ ఆఫ్రికన్ దేశాలలో భారత ప్రభుత్వానికి కమిషనర్‌గా పనిచేశాడు. 1957-1977 మధ్యకాలంలో రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ లోక్‌సభ మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు.[1]

జే.రామేశ్వర్ రావు
జానంపల్లి రామేశ్వరరావు

పదవీ కాలం
1957-1977
నియోజకవర్గం మహబూబ్ నగర్

వ్యక్తిగత వివరాలు


జననం ఫిబ్రవరి 6, 1923
మద్రాసు
మరణం సెప్టెంబర్ 15, 1998
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి శాంత
సంతానం 3 కుమార్తెలు
మతం హిందూ
వెబ్‌సైటు లేదు

రామేశ్వరరావు 1923, ఫిబ్రవరి 6వ తేదీన మద్రాసులో జన్మించాడు. ఈయన తండ్రి రాజా కృష్ణదేవరావు, తల్లి రాణీ సరళాదేవి. వనపర్తి సంస్థానాధీశుల కుటుంబములో జన్మించిన రామేశ్వరరావు 1944లో 21 యేళ్ళ వయసులో సంస్థానము యొక్క పాలన బాధ్యతలను చేపట్టాడు.[2] హైదరాబాద్‌లోని నిజాం కళాశాల, మద్రాసు విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయంలో చదివాడు. వృత్తిరీత్యా వ్యవసాయదారుడు, వ్యాపరస్తుడు అయిన రామేశ్వరరావు వ్యవసాయము, సాగునీటి అభివృద్ధికి కృషిచేశాడు.[3]

రామేశ్వరరావుకు శాంతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నటి అదితి రావ్ హైదరీ (అతని కుమార్తె కుమార్తె), కిరణ్ రావ్ (అతని కొడుకు కుమార్తె) మనవరాళ్ళు.

1948లో ఓరియంట్ లాంగ్‌మన్ (ఇప్పుడు ఓరియంట్ బ్లాక్‌స్వాన్ ) ను ప్రత్యేకంగా భారతీయ పుస్తక ప్రచురణ సంస్థగా స్థాపించాడు. రామేశ్వరరావు 1949లో ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరి 1950-52ల మధ్య నైరోబిలో ప్రథమ భారతీయ రాయబారిగా పనిచేశాడు. 1953 నుండి 1956 వరకు గోల్డ్‌కోస్ట్ (ఘనా), నైజీరియాలకు భారత రాయబారిగా ఉన్నాడు. వ్యవసాయకూలీలను సంఘటితం చేసి లేబర్ యూనియన్ల ఏర్పాటుకు తోడ్పడ్డాడు.[4] ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన రామేశ్వరరవు 1958లో ఐక్యరాజ్యసమితికి భారతీయ బృందంలో, 1960-61లో ఐక్యరాజ్యసమితీ కాంగో కన్సీలియేషన్ కమిషన్లోనూ, 1964-65లో అల్జీర్స్లో జరిగిన ఆఫ్రో-ఆసియా సదస్సులో సభ్యునిగా వెళ్ళాడు.

రామేశ్వరరావు 2వ, 4వ, 6వ లోక్‌సభలకు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 1957 నుండి 1979 వరకు మూడు సార్లు ఎన్నికయ్యారు. చురుకైన పార్లమెంటు సభ్యుడిగా రామేశ్వరరావు పార్లమెంటు విదేశాంగ వ్యవహారాల సలహా సంఘంలోనూ, ప్రణాళికా సలహా సంఘంలోనూ సభ్యుడిగా పనిచేశాడు.

  1. రెండవ లోక్ సభ, 1957- 62
  2. మూడవ లోక్ సభ, 1962-67
  3. నాల్గవ లోక్ సభ, 1967-70
  4. ఐదవ లోక్ సభ, 1971-77
  1. ఐక్యరాజ్యసమితికి భారత ప్రతినిధి బృందం, 1958
  2. యునైటెడ్ నేషన్స్ కన్సిలియేషన్ కమిషన్ (కాంగో), 1960-61
  3. అల్జీర్స్‌లో జరిగిన ఆఫ్రో-ఆసియన్ కాన్ఫరెన్స్‌కు భారత ప్రతినిధి బృందం, 1964-65[5]

రామేశ్వరరావు 1998, సెప్టెంబర్ 15న 75 ఏళ్ల వయసులో హైదరాబాదులో మరణించాడు.[6]