జానపదము


Contributors to Wikimedia projects

Article Images

జానపదము సంగీత రచనల కంటే చాలా ప్రాచీనము. జానపదమునకు రచయిత లేడు. కాని జానపదమే సంగీత రచనల అభివృద్ధికి పునాది.

భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

దినమంతయు కాయకష్టపడు కర్షకునికి, పొద్దుతురుగుతూనే ఇంటివైపు మరలి సంకటో అంబలో నోట్లో వేసుకొని, తన యింటి ముంగిట మట్టి అరుగుపై జారగిల బడుకొని తనకొచ్చిన కూనిరాగముల పాడును. అదియే మన సంగీతమునకు పునాది రాళ్ళు. పల్లెటూరి పడుచులు తమ ఇండ్ల రోళ్లు యొద్ద, ధాన్యమును దంపునపుడునూ, తమ యిండ్లలో పిండ్లు తిరగలితో విసరుచునూ, తమ భర్తలకు, అన్నదమ్ములకు సహాయపడుచు పైర్లలో కలుపుతీయుచును, నిద్రకై ఏడ్చెడి పాపాయిల జోకొట్టుచునూ పాడెడి పాటలే మన సంగీతమునకు ఆధార షడ్జమములు. ఈ పాటలు చట్ట బద్ధములు కావు. ఎవరెవరికో తోచిన భావములను వారు వాటిని తమ తమ ఇష్టమెట్టులతో ఇమిడ్చిన పాటలివి.

వీటికి కష్టమైన సంచారములు కానీ, సాంగతులు గాని ఉండవు. ఇవి అపూర్వ రాగాలలో రచింపబడి యుండవు. తాళములు సాధారనముగా ఆది, చాపు, రూపకములలో ఉండును. చాపు తాళములు మిశ్రజాతి కావచ్చును. ఖండజాతి కావచ్చును . త్రిశ్రజాతియు కావచ్చును.

జానపదగీతాల యొక్క సాహిత్యము కాలమార్పును, సంఘమార్పును, భావమార్పును, మతమార్పును, బట్టి మారిపోవవచ్చును. కొన్ని పాటలకు ఆది అంత్యాలు కనబడవు. ఉదాహరణానికి లాలిపాట తీసికుందాము. పూర్వము నుండి "నిద్రపో నిద్రపో నీలవర్ణుడా - నిద్ర కన్యకలొచ్చి నిన్ను పూచేరు" అని ఉంది. కొన్ని తరముల తర్వాత దీనిని పొంపొందించె,

నిద్రకన్యకలొచ్చి నిన్ను ఊచేరూ,
నాగకన్యకలొచ్చి నాట్యమాడేరు ||హోయీ హోయీ||
నాగకన్యకలొచ్చి నాట్యమాడేరు
దేవకన్యకలొచ్చి నీకు పాడేరు ||ఉళ ఉళ యోయీ||

అని రచింపబడెను. ఇట్లు అనేకములు ఉన్నాయి.కనుక వీటికి సంగీత రచన వలె స్థిరమైన సాహిత్యములుండవు. మార్పుదల చెందుతూ పోతాయి.సంగీత శాస్త్రబద్ధములు కాని గీతములన్నియు జానపదములే.

  1. ఒక్కస్థాయిలోనే రచించబడి యుండును. ఏలనన, పల్లెవారు గొంతును ఇతర స్థాయిలకు పోనిచ్చుటకు తెలియనివారు గాన వారందరు సులభరీతిని పాడుటకు వీలుగా నుండును.శిక్షణ వల్ల మన శరీరమును సాధారణముగా పాడు స్థాయికి ½ స్థాయి క్రిందికినీ, ½ స్థాయి పైననూ పాడుటకు అలవాటు చేసికోగలము.
  2. ప్రతిమధ్యమ రాగము లోనూ, అపూర్వరాగములోను జానగీతములు అరుదు.
  3. సాహిత్యము సామాన్య, భాషలోను వ్యాకరణబద్ధము కానివి గాను ఉండును.
  4. సాహిత్యభావము సాధారణము. కొన్నిచోట్ల ద్వందార్థములతో వేదాంతమును తెలుపు పాటలు ఉన్నాయి. ఈ రకపు పాటలు మతప్రచారమునకే రచించిన పాటలు.
  5. రచించిన మెట్టు సామాన్యము గాను, ఇంపుగాను జనాకర్షణగా ఉండును.
  6. సాధారణముగా ఈ పాటలు ద్విపదలు గానో లేక కొన్ని పాదములు కలవి గానో ఉండేవి. పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములు ఏ కొన్ని రచనలలో ఉండేవి.
  7. సంగతులు గాని, గమకములు గాని ఉండవు.
  8. సామాన్య తాళములలోను సంకీర్ణరాగాలలోను రచింపబడి ఉండును.

జానపదమును రెండు భాగములుగా విభజింపవచ్చును.

  1. మోటు జానపదములు (అనగా కలుపు తీసే పాటలు మొదలగు వృత్తి పాటలు)
  2. నాజూకు జానపదములు ( అనగా పౌరాణిక పాటలు, స్త్రీలపాటలు, పెళ్ళిపాటలు మొదలగునవి)

జానపదములు వాటి విషయము బట్టి ఈ క్రింది విధముగా విభజింపవచ్చును.

  1. లాలిపాటలు : ఇవి బిడ్డలను లాలియందుంచి ఊపుచూ పాడు పాటలు. ఇవి సాధారణంగా ఆనంద భైరవి, నీలాంబరీ రాగాలలో ఉండును. నవరోజులో మన ఆంధ్రా లాలిపాటలు పూర్వముండినట్లు తెలియుచున్నవి.
  2. దంపుళ్ళ పాటలు : ధాన్యమును నల్గురు, ఐదుగురు, ఆర్గురు వనితలు కలిసి దంచునపుడు కష్టము తెలియకుండుటకై పాటలు పాడుదురు. అవి చాలా హాస్య పూరితముగా ఉండును.
  3. కలుపుతీసే పాటలు : స్త్రీలు పైర్లలో కలుపు తీయుచు ఆ తీయు లయకు సరియగు లయలో పాటలు పాడుదురు. వాటిలో కొన్ని ద్వందార్థములు కలవి నుండును.
  4. వృత్తి పాటలు  : పాలనమ్ము పడతి పాట, నీళ్లు తోడువాని పాట, ఓడ పాటలు, దొమ్మరిగడ పాటలు, ఏలలు మొదలగునవి.
  5. నీతి పాటలు  : నీతిని తెలుపు పాటలు.
  6. నామక్కరణ పాటలు  : సంపత్తు శుక్రవారపు పాటలు, ఆశీర్వాదములు వియ్యంకుల పాటలు, హరిబువ్వము పాటలు, సమర్త పాటలు, అత్తవారింటికి పంపు పాటలు, నలుగు పాటలు, పెళ్ళి పాటలు, పూజ పాటలు, స్త్రీల పాటలు, సువ్వి పాటలు, మేలుకొలుపులు, హాస్య పాటలు, యెగతాళీలు, మంగళహారతులు మొదలగునవి.
  7. చారిత్రక పాటలు  : బొబ్బిలి పాట, రాజా దేశింగుపాట మొదలగునవి.
  8. పౌరాణిక పాటలు : కుచేలు కథ, వరలక్ష్మీ వ్రత పాటలు, గౌరీవ్రత పాటలు మొదలగునవి.
  9. గుమ్మి, కోలాట పాటలు, ధనుస్సు పాటలు.
  10. హాస్యపు పాటలు, మొదలగునవి.

తక్కినవి గ్రామదేవతకు దేవర చేయునపుడు పాడు పాటలు, తక్కినవి గ్రామ క్షేమము కొరకు చేయు ఉత్సవాలలో పాడే పాటలు, వర్షము రాకపోయిన ఊరిలో కొందరు వానదేవునికి ప్రార్థించే పాటలు, మొదలగు ఎన్నో రకములైన పాటలు వేలకు వేలు మన దేశములో ఉన్నాయి.