నకాశీ చిత్ర కళ


Contributors to Wikimedia projects

Article Images

నకాశీ చిత్ర కళ

తెలంగాణ ప్రాంతంలో వర్దిల్లిన ఒక జానపద చిత్ర కళ

గతంలో తెలంగాణ ప్రాంతంలో వర్దిల్లిన ఒక జానపద చిత్ర కళను నకాశీ/నకాషి చిత్రకళ అని అంటారు. పురాణాలు, జానపద కథలు, కుల పురాణాలలోని ఘట్టాలను ఒక బట్టపై రంగులతో చిత్రాల రూపంలో చిత్రించి, దాని ఆధారంగా అందులోని కథలను ప్రేక్షకులకు చెప్పేవారు. అలా రంగులలో చిత్రాలను రచించే కళను నకాషి చిత్రకళ అని అంటారు.అలా చిత్రాలను రచించేవారిని నకాషి వారు అని అంటారు.నకాషి అనే పదం ఉర్దూ నుంచి వచ్చింది.నక్ష్ అంటే అచ్చు గుద్దినట్లు చిత్రించటం అని అర్దం. దీనినే 'నగిషీ' అని కూడా అంటారు.పూర్వం ఈ చిత్రకళను నవాబులు వాళ్ల రాజ దర్బారుల్లో, మహల్స్‌లో స్వంతంగా వేయించి ఆదరించారు.నవాబులు పెట్టిన ఈ ఉర్దూ పేరుకు 'చిత్తంగా', 'చిత్తారి' అనే పేర్లుకూడా ఉన్నాయి.నవాబులు ఇష్టంగా నకాషీలు అని పిలిచేవారు[1]కాల క్రమంలో వారిది నకాషి కులంగా మార్పు చెందింది. మునుపటి వరంగల్ జిల్లా చేర్యాల (పునర్య్వస్థీకరణలో సిద్దిపేట జిల్లాకు మారింది)లోనూ, కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలంలోని తిప్పాపురం, అనుపురం గ్రామాల్లో నకాషీ వారున్నారు. ఈ కులంలో చాల మంది తమ కుల వృత్తిని మానేసి, వేరే వృత్తులను చేపట్టి జీవనం సాగిస్తున్నారు.వరంగల్ జిల్లా చేర్యాలలో వున్న రెండు నకాషి కుటుంబంలోని వారు మాత్రం ఇప్పటికీ ఈ చిత్ర కళనే వృత్తిగా తీసుకొని జీవనం సాగిస్తున్నారు. చేర్యాలలో ఈ పటాలను చిత్రిస్తున్నందున ఈ నకాషీలు వేసే పటాలను చేర్యాల పెయింటింగ్స్, నకాషీ చిత్రాలు, నకాషి పటచిత్రాలు అని వ్యవహరిస్తున్నారు.[2]

నకాషి చిత్రకళా కాన్యాస్

చిత్రాలు వేసేందుకు (కాన్వాస్) బట్ట తయారి విధానం

మార్చు

చేనేత/ఖాదీ ముతక గుడ్డను ఒక గజం వెడల్పు వున్న తెల్లటి గుడ్డను తీసుకొని వారు వేయబోయే కథాంశాన్ని బట్టి అనగా రామాయణం, మహా భారతం వంటి పెద్ద కథలకైతే సుమారు 40 గజాల పొడవైన బట్టను, కథాంశం తక్కువైతే తక్కువ పొడవు గల బట్టను తీసుకుంటారు.కథను బట్టి బట్ట పొడవును నిర్ణయించు కుంటారు. ఆ బట్టకు ముందుగా, గంజి, సుద్ద పొడి, జిగురు, చింతగింజల అంబలి కలిపిన మిశ్రమాన్ని పట్టిస్తారు. గుడ్డ బాగా ఆరాక అదే మిశ్రమాన్ని మరొక సారి పట్టిస్తారు. దీని వల్ల గుడ్డ దళసరిగా మారి బొమ్మలు వేయడానికి వీలుగా వుంటుంది. బాగా ఎండిన ఆ గుడ్డను చాప లాగ చుట్టి బద్ర పరుచు కుంటారు.

తాము చెప్పబోయే కథకు తగిన బొమ్మలను వేయించుకోడానికి ఆయా కళాకారులు నకాషి కళాకారులను వెతుక్కుంటూ వస్తారు. తమ కథకు కావలసిని పటాన్నిచిత్రించు కోడానికి అదివరకే తమ వద్ద వున్న పాతదై పాడైపోయిన పటాన్నిచ్చి అలాంటి దానినే చిత్రించుకుంటారు. లేదా కొత్తది కావాలంటే తమకు కావలసిన కథా ఘట్టాలని నకాషి చిత్ర కళాకారులకు వివరించి తమకు కావలసిన విధంగా బొమ్మలను చిత్రించుకుంటారు. కథకులు వారి కథలోని పాత్రల హావభావాలను వివరిస్తారు.ఆ వివరణను బట్టి నకాషి చిత్ర కళాకారులు ఆయా బొమ్మలకు ఎలాంటి రంగులు వేయాలో నిర్ణయించుకొని, దాని ప్రకారము నకలు (స్కెచ్) గీసు కుంటారు. కొందరు కథకులు నకాషి వారి వద్దనే మూడు నాలుగు రోజులుండి తమ కథను వివరిస్తూ, తగు మార్పులు, చేర్పులు సూచిస్తూ స్కెచ్ పూర్తియ్యేంత వరకు వుంటారు. ఈ సమయములో కథకులు నకాశీ వారికి మర్యాద చేస్తారు. దానిని 'బత్త ' అంటారు.

నకాషీలు తమకు కావలసిన రంగులను తామే తయారు చేసుకుంటారు. ప్రకృతి నుండి లబ్యమయ్యే ఆకులు, పసరులు, రంగు రాళ్లు, గింజలు, గవ్వలు, మొదలగు వాటినుండి సేకరిస్తారు.గతంలో ఈ రంగులలో రసాయినాలు వాడేవారు కాదు. ఇప్పుడిప్పుడు ఆయిల్ పెయింటులను వాడుతున్నారు. ఉదాహరణకు తెలుపు రంగు కొరకు జింక్ వైట్ పౌడర్ లో సమ పాళ్లలో నీళ్లు కలిపి తెలుపు రంగును తయారు చేసి వాడుతున్నారు. అదే విధంగా నలుపు రంగుకు లాంప్ పౌడర్ ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో అన్ని రకాల రంగులు పొడి రూపంలో దొరుకుతున్నాయి.వాటిని హైదరాబాదు మొదలగు పట్టణాలలో కొనుగోలు చేస్తున్నారు.

బ్రష్ లు మూడు రకాలుగా వుంటాయి.అవి చిన్నవి. మద్య రకం, పెద్ద బ్రష్ లు. గతంలో చిన్న బ్రష్ లను ఉడత తోకలోని వెంట్రుకలను సేకరించి తామే స్వంతంగా తయారు చేసుకునేవారు.అదే విధంగా మద్య రకం బ్రష్ లను, మేక తోకలోని వెంట్రుకలతో, పెద్ద బ్రష్ లను గుర్రం తోకలోని వెంట్రుకలతో తయారు చేసుకునే వారు. ఆయా వెంట్రుకలను ఒక వెదురు పుల్లకు కట్టి తమకు కావలసినన్ని బ్రష్ లను తామే తయారు చేసుకునే వారు.ప్రస్తుత కాలంలో రంగులమ్మే దుకాణంలోనే అన్ని రకాల బ్రష్ లు అమ్ము తున్నారు.ప్రస్తుతం వాటినే వాడు తున్నారు.

పూర్తైన పటాన్ని కథకుడు వచ్చి పరిశీలించి ఏమైనా మార్పులు చేర్పులు చేయదలిస్తే వాటి విషయాని నకాషి వారికి తెలియ పరిచి తమకు కావలసిన విధంగా బొమ్మలను చిత్రీకరించుకుంటారు. కొందరు కథకులు తమ పటంలో తమ కుల దేవత బొమ్మను గీయించు కుంటారు. పటం వేసిన తర్వాత ఆ పటం వేసిన కళాకారులకు ఏదైనా కీడు జరుగుతుందనే నమ్మకం వుంది. అలా జరగ కుండా వుండడానికి కథకులు నకాషి కళా కారులకు తమ ఇంటి నుండి ఐదు కిలోల బియ్యం, ఐదు కుడకలు, ఐదు నిమ్మకాయలు, ఐదు కొబ్బరి కాయలు, పసుపు, కుంకుమ, ఒక వేట (పొట్టేలు)ను తీసుకొని వచ్చి నకాషి వారింటికి తెచ్చి ఇస్తారు. బ్రాంహ్మణుని సంప్రదించి మంచి ముహూర్తంలో ఆ ఇంటిలో ఆ పటాన్ని వేలాడ దీస్తారు.అంతవరకు పటంలోని దేవతా మూర్తికి కండ్లు చిత్రించబడి వుండవు. కథకులు సమర్పించి కొత్తబట్టలు కట్టుకొని నకాషి వాళ్లు తమ ఇష్ట దేవతైన నిముషాంబికా దేవికి పూజచేసి అప్పుడు దేవతా మూర్తికి కండ్లు చిత్రీకరిస్తారు. ఈ తతంగమంతా నకాషి వారింట్లోనే జరుగుతుంది, నకాషి వాళ్లు పటం ముందు వేటను కోస్తారు (ఈరోజుల్లో కోడిని కోస్తున్నారు) అక్కడే అందరూ మాంసం, మద్యంతో విందు ఆరగిస్తారు. అప్పుడు కథకులు పటం వేసిన నకాషి వారికి ఇంకా ఏమైనా డబ్బులు ఇవ్వవలసి వుంటే సమర్పించుకుంటారు. నకాషి వాళ్లు ఆ పటాన్ని ఒక క్రమ పద్దతిలో చుట్టి ఎత్తి పట్టుకొని తమ ఇంటి గడప దాటేంత వరకు ఎత్తుకొని, తర్వాత కథకుల బుజాన పెట్టి కొంత దూరం సాగనంపి తిరిగి వస్తారు.కథకులు పటాన్ని ఎత్తుకొని తమ ఊరికి వెళతారు.

పూర్వం పటం గీయడానికి ఐదు వందల నుండి వేయి రూపాయలు వరకు తీసుకునేవారు. ఆతర్వాత కాలంలో అది పది వేలకు పైబడి వుంది.ప్రస్తుతం పటం గీయడానికి గజాల లెక్కన వసూలు చేస్తున్నారు. గజానికి 150 రూపాయలు తీసుకుంటున్నారు. అలా పటం గీయడాని ఎక్కువ ఖర్చు అవుతున్నందున ప్రస్తుతం ఉన్న పటాన్నే జాగ్రత్తగా వాడు కోవడమో, లేదా పటం వున్న వాళ్ల వద్దనుండి కిరాయికి తీసుక రావడమో చేసి, తమ పని కానిచ్చు కుంటున్నారు. అందు చేత కొత్త పటాలని గీయించుకునేవారు ప్రస్తుతం మరుగు అవుతున్నారు, ప్రస్తుతం నకాషి వాళ్లు కాకిపడిగెలు, ఏనూటి, గౌడ జెట్టి వాళ్ళకు మాత్రమే పటాలు గీస్తున్నారు. అరుదుగా ఎవరి వద్దనన్నా పాత కాలం నాటి పటం వున్నా దాని ఉపయోగం గాని, దాని చరిత్ర గాని వీరికి తెలియడం లేదు.

  1. "andhrajyothy.com/telugunews/abnarchievestorys-338133". andhrajyothy. Retrieved 2021-09-23.[permanent dead link]
  2. "Nakashi Art: The Dying Art Form From Telangana Now Struggle - Sakshi". web.archive.org. 2022-06-20. Archived from the original on 2022-06-20. Retrieved 2022-06-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

పటం కథలు (పుస్తకం ) ప్రచురుణ. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. హైదరాబాదు.