సహదేవుడు


Contributors to Wikimedia projects

Article Images

సహదేవుడు

మహాభారతంలో పాండవులలో ఆఖరివాడు, మాద్రి కొడుకు

సహదేవుడు మహాభారత ఇతిహాసములొ పాండవులలో ఐదవవాడు. అశ్వనీదేవతల అంశ. పాండు రాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి మాద్రి అశ్వనీదేవతలచే నకుల సహదేవులను కన్నది.

దస్త్రం:Arishtanemi-Sahadeva.jpg
సహదేవుడు


పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం ఉపపాండవులలో శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృత్తిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. (Ref: Mbh 1. 223). సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిగిన పుత్రుడు సుహోత్రుడు. (MBh.1.95). సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే)


ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు "తంత్రీపాలుడు" అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు.


యుధిష్ఠిరుడు రాజయినాక దక్షిణదేశ దండయాత్రకు సహదేవుని పంపాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయంచాడు. సహదేవుడు బృహస్పతి వలె గొప్ప వివేకము కలవాడని, రాబోవు ఘటనలను ముందుగానే ఊహింపగలడని, కాని శాపవశాన భవిష్యత్తును ముందుగా చెప్పలేదని ప్రతీతి.