అలీ నవాజ్ జంగ్ బహాదుర్


Contributors to Wikimedia projects

Article Images

అలీ నవాజ్ జంగ్ బహాదుర్

(అలీ నవాజ్ జంగ్ బహదూర్ నుండి దారిమార్పు చెందింది)

మీర్ అహ్మద్ అలీ, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ ( ఉర్దూ లో - میر احمد علی، نواب علی نواز جنگ بہادر ) - తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు.[1] 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో, అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ పుట్టిన రోజైన జూలై 11ను తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి, ఆయన జయంత్యుత్సవాలను ఎర్రమంజిల్ లోని జలసౌధలో ఘనంగా జరుపుకున్నారు.[2]

మీర్ అహ్మద్ అలీ
میر احمد علی
అలీ నవాజ్ జంగ్ బహాదుర్

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహం


వ్యక్తిగత వివరాలు


జననం 1877 జూలై 11
హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం (ప్రస్తుతం తెలంగాణా)
మరణం 1949 డిసెంబరు 6 (వయసు 72)
జాతీయత భారతీయుడు
పూర్వ విద్యార్థి నిజాం కళాశాల
వృత్తి ఇంజనీరు
వృత్తి ఇంజనీరు
మతం ముస్లిం
అలీ నవాజ్ జంగ్ బహదూర్‌ పట్టభద్రుడైన ప్రఖ్యాత కూపర్స్ హిల్ రాయల్ ఇండియన్ ఇంజనీరింగ కళాశాల భవనం (2004లో)

హైదరాబాదు ప్రజలకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌గా పరిచితుడైన ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 1877 జూలై 11న హైదరాబాదులో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి మీర్ వాహిద్ అలీ, హైదరాబాదు రాజ్యంలో భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేందుకు నియమించబడిన కార్యాలయం, ‘ధప్తర్-ఎ-ముల్కీ’లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తుండేవారు.[3] మీర్ అహ్మద్ అలీ హైదరాబాదు, అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో, మద్రసా ఆలీయాలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అక్కడ ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకొన్నాడు. ఆ తర్వాత నిజాం కళాశాలలో చేరి నాలుగేండ్లు ఉన్నత విద్యను అభ్యసించాడు. 1896లో నిజాం ప్రభుత్వపు ఉపకార వేతనంతో ఇంగ్లండులో ప్రఖ్యాతి గాంచిన కూపర్స్ హిల్ లో ఉన్న రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి, సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. కూపర్స్ హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిభావంతుడైన విద్యార్థిగా తన తరగతిలో ప్రథముడిగా నిలిచి అనేక స్కాలర్‌షిప్పులను అందుకున్నాడు.

1899లో ఇంగ్లండు నుండి తిరిగి వచ్చి, అదే సంవత్సరం హైదరాబాదు ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో (పీడబ్ల్యూడీ) లో సహాయ ఇంజనీరుగా చేరాడు. 1913లో నిజాం ప్రభుత్వ ప్రజాపనులు, టెలిఫోన్ శాఖల కార్యదర్శి అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ ఇంజనీరయ్యాడు. 1886లో ఈ పదవి సృష్టించిన తర్వాత చీఫ్ ఇంజీనీరైన మొట్టమొదటి భారతీయుడు అలీ నవాజ్ జంగే. ఆ తర్వాత 1918లో చీఫ్ ఇంజనీరు సెక్రటరీగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశాడు. తర్వాత కూడా హైదరాబాదు ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సాంకేతిక సేవలు అందించాడు. 1929లో బొంబాయి ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఈయన్ను మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి సుక్కూరు బారేజి యొక్క ఆర్థిక, సాంకేతిక అంశాలపై నివేదిక తయారుచేసేందుకు ఆహ్వానించింది. బొంబాయి ప్రభుత్వం ఈయన కృషిని తగువిధంగా గుర్తింపు ఇచ్చింది.

ఆయన తెలంగాణ చరిత్రలో ప్రజలెన్నడూ మరువలేని నిర్మాణాలను చేపట్టారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్, జూబ్లీహాల్ తదితర ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ప్రజల అవసరాలను తీర్చారు.[1]

1908 మూసీ నది వరద తర్వాత, మూసీకి తరచుగా వస్తున్న వరదల నియంత్రణకు నివారణా చర్యలు సూచించేందుకు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాదుకు ఆహ్వానించాడు. హైదరాబాదు విచ్చేసిన విశ్వేశ్వరయ్యకు సహాయకారిగా ఉండేందుకు, అప్పటి హైదరాబాదు పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ టి.డి.మెంకజీ, కూపర్ హిల్ విద్యార్థి అయిన అహ్మద్ అలీని విశ్వేశ్వరయ్యకు సిఫారసు చేశాడు.[4] అలీ నవాజ్ జంగ్ అప్పటికే ప్రజాపనుల శాఖలోని నీటిపారుదల విభాగానికి చీఫ్ ఇంజనీరుగా వ్యవహరిస్తున్నాడు.[5] వీరిద్దరి కృషి ఫలితమే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల రూపకల్పన. ఈసీ నదిపైన హిమాయత్ సాగరును సి.టి.దలాల్, క్లెమెంట్ టి. ముల్లింగ్స్ కట్టించగా, మూసీ నదిపైన ఉన్న ఉస్మాన్ సాగర్ చెరువు నిర్మాణం మాత్రం అలీ నవాజ్ జంగే స్వయంగా పర్యవేక్షించాడు.[4] ఈ రెండు చెరువులు మూసీ నదిలో వరదలని నియంత్రించడమే కాక నగరానికి శాశ్వత తాగునీటి వనరులుగా సేవలందిస్తున్నాయి.[5] హైదరాబాదులో పనిచేసిన సమయంలో అహ్మద్ అలీ అందించిన సహాయసహకారాలకు, సూక్ష్మబుద్ధిని, చొరవను విశ్వేశ్వరయ్య కొనయాడాడు.[4]

హైదరాబాదులో చీఫ్ ఇంజనీరుగా ఉన్నకాలంలో అలీ నవాజ్ జంగ్, అనేక భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా నిర్మింపచేశాడు. వీటితో పాటు నవాబ్ సాహెబ్ అనేక భవంతులు, గోదావరి, మంజీరా నదుల మీద పెద్ద వంతెనలతో పాటు అనేక వంతెనల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించాడు. టెలిఫోన్ సౌకర్యం జిల్లాలకు విస్తరింపజేయటం ఈయన చొరవతోనే జరిగింది. వైరా, పాలేరు, ఫతే నహర్ ప్రాజెక్టులు కూడా అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసి కట్టించినవే.[6] అలీ నవాజ్ జంగ్ రూపకల్పనలలో నిజాంసాగర్ ఆనకట్ట అత్యంత ఉన్నతమైనది.

ఢిల్లీలోని హైదరాబాద్ హాస్ అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసి, తన పర్యవేక్షణలో కట్టించాడు. మద్రాసు, హైదరాబాదు ప్రభుత్వాల మధ్య తుంగభద్ర, కృష్ణా నదీ జలాల పంపకం సమస్యను ఈయనే పరిష్కరించాడు. అత్యంత క్లిష్టమైన ఈ సమస్యను ఈయన చాలా చాకచక్యంగా పరిష్కరించాడు. 1930లో మద్రాసు ప్రభుత్వం 50% నదీజలాలను వాడుకొనే హక్కును నిజాం ప్రభుత్వానికి అప్పగించింది. హైదారాబాదులో అత్యంత ప్రతిభావంతమైన ఇంజనీర్లలో ఒకడైన అలీ నవాజ్ జంగ్ పేరుమీద నిజామాబాదులోని అలీసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేశారు.[7]

1938లో భారత జాతీయ కాంగ్రేస్ ప్రణాళికా సంఘం జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ ప్రణాళికా సంఘం ‘సాగునీరు, నదుల మళ్లింపు’ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘానికి అలీ నవాజ్ జంగ్ అధ్యక్షుడిగా నియమితులు కావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అలీ నవాజ్‌జంగ్ నేతృత్వంలోని ఉపసంఘం నదీ జలాల వినిమోగంపై, తాగునీటి పథకాలపై, జల విద్యుత్ పథకాలపై, వరద నియంత్రణ పథకాలపై, జలరవాణా పథకాలపై, కాలువలు, చిన్న నీటి చెరువుల నిర్మాణాలపై సమగ్రమైన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మూడు విభాగాలున్నాయి. మొదటిది భారతదేశంలో సాగునీటి పథకాల నిర్మాణం, రెండవది నదుల మళ్లింపు-వరద నియంత్రణ పథకాలు, మూడవది జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం.[5] 1944లో మహమ్మద్ అలీ జిన్నా ఏర్పడిన అఖిలభారత ముస్లిం లీగ్ ప్రణాళిక సంఘానికి అలీ నవాజ్ జంగ్‌ను అధ్యక్షుడిగా నియమించాడు.[8][9]

అలీ నవాజ్ జంగ్ బహదూర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టులు:

చారిత్రక భవనాలు:

  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, హాస్టల్ భవనాలు,
  • ఉస్మానియా జనరల్ హాస్పిటల్.
  • ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్.
  • పబ్లిక్ గార్డెన్స్ జూబ్లీహాల్.
  • అబ్దుల్ గంజ్ లోనే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ.
  • మహబూబియా బాలికల పాఠశాల.
  • నాందేడ్ సివిల్ ఆస్పత్రి.
  • యునాని ఆసుపత్రి

అలీ నవాజ్ జంగ్ 1949 డిసెంబరు 6న హైదరాబాదులో మరణించాడు. ఈయన అంతిమయాత్రకు అనేక మంది ప్రముఖులతో పాటు నిజాం నవాబు కూడా హాజరయ్యాడు. రాజగోపాలాచారి సంతాప సందేశాన్ని పంపించాడు.