ఇక్రిశాట్


Contributors to Wikimedia projects

Article Images

ఇక్రిశాట్

హైదరాబాదు లోని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ

(ఇక్రిశాట్‌ నుండి దారిమార్పు చెందింది)

ఇక్రిశాట్‌ [ఆంగ్లం: ICRISAT - ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (International Crops Research Institute for the Semi-Arid Tropics)] వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ పరిశోధనా సంస్థ. అధిక దిగుబడినిచ్చే అనేక వంగడాలను కనుగొన్నది. మెట్ట పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికై కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాదు లోని పటాన్‌చెరు వద్ద ఉంది. ఇంకా కెన్యా, మాలి, నైజీరియా, మలావి, ఇథియోపియా, జింబాబ్వే లాంటి దేశాల్లో దీనికి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సంస్థను 1972 లో ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ లాంటి కొన్ని సంస్థలు కలిసి స్థాపించాయి.

ఇక్రిశాట్
ఆశయంసైన్స్ ఆఫ్ డిస్కవరీ టు సైన్స్ ఆఫ్ డెలివరీ
స్థాపన1972
రకంఅంతర్జాతీయ సంస్థ
కార్యస్థానం
ముఖ్యమైన వ్యక్తులుజాక్విలిన్ డి అర్రోస్ హ్యూస్, కిరణ్ కె శర్మ, జోనా కేన్ పొటాకా
మాతృ సంస్థCGIAR
ఇక్రిశాట్

ఇక్రిశాట్ స్థాపన కోసం ఆఫ్రికాలో 7 స్థలాలను, ఆసియాలో 5 స్థలాలనూ పరిశీలించాక, హైదరాబాదు లోని నేల స్వభావం కారణంగా దీన్ని ఎంచుకున్నారు. స్థాపనపై భారత్ ప్రభుత్వం, ఫోర్డ్ ఫౌండేషను 1972 మార్చి 28 న అవగాహన పత్రంపై సంతకం చేసాయి. 1,374 హెక్టార్ల స్థలాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సంస్థ ఏర్పాటు కోసం, అప్పటి మెదక్ జిల్లా లోని కాచిరెడ్డిపల్లి, మన్మూల్ గ్రామాల్లోని 4,000 మంది ప్రజలను ఖాళీ చేయించి సమీపం లోని రామచంద్రపురం గ్రామంలో పునరావాసం కలిగించారు. [1] జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.

సెమి అరిడ్ ట్రాపిక్స్ (SAT) అంటే ఉష్ణమండల అర్ధ శుష్క భూములు. ఈ భూముల్లో అత్యల్ప నుండి మధ్యస్థాయి వర్షాలు పడతాయి. వీటి సాగుకు కూడా పెద్దగా వీలుపడదు. ఈ భూముల సారంలో ఎక్కువ వైరుధ్యం ఉంటుంది. SAT భూముల్లో సంవత్సరానికి సగటున 700 మి.మీ వర్షపాతం ఉంటుంది. వ్యవసాయ పరంగా చూస్తే ఇది సాగుకు అంతగా అనుకూలం కాని భూమి. (Less Favored Area - LFA).[2]

వీటిలో పంటలు పండించడానికి ఇక్రిశాట్ సహజ సిద్ధమైన పద్ధతులతో కూడిన జెనెటిక్ విధానాలు అవలంబిస్తోంది.

ఇక్రిశాట్ స్థాపించి 50 ఏళ్లయిన సందర్భంగా హైదరాబాదులో నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా 2022 ఫిబ్రవరి 5న దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించాడు. ఇక్రిశాట్ 50 వ‌సంతాల‌ లోగోతో పాటు పోస్ట‌ల్ స్టాంప్‌ను ఆవిష్క‌రించాడు.[3] ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలన్నాడు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పెనుమార్పులు చోటుచేసుకోవాలన్నాడు.[4] ఇక్రిశాట్‌ పరిశోధనల పురోగతిపై ప్రధానికి ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్ జాక్వెలిన్‌ డి ఆరోస్‌ వివరించింది. కొత్త వంగడాల రూపకల్పనను, వాటిని రైతులకు చేరవేస్తున్న తీరునూ వివరించింది.[5]