గడ్డం రాంరెడ్డి


Contributors to Wikimedia projects

Article Images

గడ్డం రాంరెడ్డి

జి.రాంరెడ్డిగా సుపరిచితులైన గడ్డం రాంరెడ్డి (డిసెంబరు 4, 1929 - జూలై 2, 1995) దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (Father of Open Universities) గా పరిగణిస్తారు.

గడ్డం రాంరెడ్డి
జననండిసెంబరు 4, 1929
కరీంనగర్ జిల్లా మైలారం
మరణంజూలై 2, 1995
లండన్
ఇతర పేర్లుజి.రాంరెడ్డి దూరవిద్యా పితామహులు
వృత్తి1977 వరకు ప్రొఫెసర్
1977 నుండి 1982 మధ్య కాలంలో ఉపసంచాలకులు

వీరు 1929 డిసెంబరు 4న కరీంనగర్ జిల్లా మైలారం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో ఎమ్.ఎ. పట్టా పొంది పి.హెచ్.డి. స్వీకరించారు. 1977 వరకు అక్కడే ప్రొఫెసర్ గా పనిచేశారు. 1977 నుండి 1982 మధ్య కాలంలో ఉపసంచాలకులుగా పనిచేశారు. వీరు హైదరాబాదులోని భారత సమాజ విజ్ఞాన పరిశోధనా మండలి (Social Sciences Research Council), దక్షిణ ప్రాంతీయ కేంద్రానికి వ్యవస్థాపక డైరెక్టర్ గా సమాజ శాస్త్రంలో పలు ప్రయోగాలు చేశారు.

1980 దశాబ్దంలో వీరు దూరవిద్య వైపు దృష్టి మళ్ళించి దానిపై విశేషాధ్యయనం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిచెందిన బ్రిటిష్ ఓపెన్ యూనివర్సిటీ గురించి నిశితంగా పరిశీలించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు సార్వత్రిక విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ప్రారంభించే విషయంలో ఒక నివేదిక సమర్పించారు. దీనిని ప్రభుత్వం ఆమోదించి 1982 లో దేశంలో మొట్టమొదటగా ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడింది. దీనిని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా నామకరణం చేశారు. దీనికి మొదటి వైస్ ఛాన్సలర్ గా వీరిని నియమించారు. వీరి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1985లో ప్రారంభించిన ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా నియమించింది. అక్కడ వారు చేసిన కృషి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. తరువాత 1991లో భారత ప్రభుత్వం వీరిని కొత్త ఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమించింది. ప్రపంచంలోని ప్రముఖ సార్వత్రిక విశ్వవిద్యాలయాలను పరిశీలించి సార్వత్రిక వ్యవస్థకు ఒక చక్కని నమూనా తయారుచేసి తొలిసారిగా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. ఈ నమూనా పలుదేశాలలో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోడానికి తోడ్పడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వీరిని సలహాదారుగా నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ లోను, భారతదేశంలోను కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా విభాగానికి వీరి పేరుపెట్టారు. వీరికి 1994లో ప్రతిష్ఠాత్మకమైన శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం ప్రదానం చేశారు.

దూరవిద్యా పితామహులైన రాంరెడ్డి గారు లండన్ లో జూలై 2, 1995లో పరమపదించారు.