నందివాడ రత్నశ్రీ


Contributors to Wikimedia projects

Article Images

నందివాడ రత్నశ్రీ

భారతీయ అంతరిక్ష విజ్ఞాన రంగంలో పరిశోధకురాలు

నందివాడ రత్నశ్రీ అంతరిక్ష విజ్ఞాన రంగంలో పరిశోధకురాలు, నెహ్రూ ప్లానిటోరియం (ఢిల్లీ) డైరక్టరు.[1]

నందివాడ రత్నశ్రీ

ఆమె 1963 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పట్టణంలో జన్మించారు. తండ్రి నందివాడ భీమారావు అకౌంట్ జనరల్ గా పనిచేసేవారు. తల్లి శ్యామల. తండ్రి ఉద్యోగరీత్యా తరచు బదిలీలు కావడంతో ఈమె ప్రాథమిక విద్య ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగింది. హైదరాబాద్ తరలి వచ్చినపుడు కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ చేసారు. ఈమె సెంట్రల్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ చదివారు. అనంతరం ముంబై విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేసారు.

బాల్యం నుండి వారి అన్నయ్య ఎప్పుడు మాట్లాడినా ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు గూర్చి అనేక వివరాలు, విశేషాలు పూసగుచ్చినట్లు చెప్పడాంతో రత్నశ్రీకి అంతరిక్ష విజ్ఞానం, భౌతిక శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. కాలక్రమంలో వీటికి సంబంధించిన పుస్తకాలను చదివేవారు. తీరిక వేళల్లో గ్రంథాలయం నుండి పుస్తకాలను తెచ్చుకును చదివేవారు.

హైదరాబాదులో ఆమె బి.ఎస్.సి చదివేటప్పుడు అక్కడి భౌతికశాస్త్ర ఆచార్యుల వల్ల ఆమెకు అంతరిక్ష శాస్త్రంపై పట్టు పెరిగింది. ఈ రంగంలోని పరిశోధనలు చేయాలన్న పట్టుదల కూడా ఏర్పడడంతో ఎం.ఎస్.సిలో కూడా భౌతికశాస్త్ర అంశాన్ని ఎంచుకున్నారు. ఆమెకు హైదరాబాదులోని పలు సంస్థల్లో అవకాశాలు అందువచ్చినప్పటికీ, మరింత మెరుగైన సదుపాయాలు ఉన్న ముంబై లోని "టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్" నే ఎంచుకున్నారు. 1986లో అరవై సంవత్సరాలకు ఒకసారి దర్శనమిచ్చే హేలీ తోకచుక్కను చూడగలగడం, ఎం.ఎస్.సి విద్యార్థిగా ఉన్న సమయంలో స్టడీ టూర్ లో భాగంగా హైదరాబాద్ సమీపంలో రంగాపురంలోని నిజామియా అబ్జర్వేటరీని సందర్శించడం వంటి అవకాశాలు కూడా ఆమెలోని ఆక్షాంక్షను ద్విగుణీకృతం చేసాయి. ఆమెకు ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు.

పి.హెచ్.డి చేసిన అనంతరం ఆమెకు బెంగళూరులో ఉద్యోగ అవకాశం లభించింది. ఆ సమయంలో ఆమె భర్త ప్యాట్రిక్ దాస్ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండేవాడు. అందువల్ల ఆమె చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్నారు. మొదట్లో ఆమె ఎడ్యుకేటర్ గా చిన్నపాటి ఉద్యోగం చేసింది. అనతికాలంలోనే అంతకు పూర్వం డైరక్టరు పదవీ విరమణ చేయడంటో, ఈమె ప్రతిభా శక్తీ గుర్తించిన ప్లానిటోరియం కమిటీ సభ్యులు ఈమెను డైరక్టరుగా నియమించారు.

ప్లానిటోరియం డైరక్టరుగా ఆమె ప్లానిటోరియం కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేయడానికి అవిరళ కృషిచేసారు. ఆమె ప్లానిటోరియం ప్రదర్శనలో వినూత్న మార్పులను కూడా ప్రవేశపెట్టడం వలన సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించేవారు.[2]

  1. "In Conversation With - Dr. Nandivada Rathnasree". Archived from the original on 2016-11-18. Retrieved 2016-11-16.
  2. భారతీయ మహిళా శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్ విజయవాడ ed.). విజయవాడ: శ్రీవాసవ్య. 1 July 2011. p. 127.