పి.జనార్ధనరెడ్డి


Contributors to Wikimedia projects

Article Images

పి జె ఆర్ గా పిలువబడే పి.జనార్ధనరెడ్డి (12 జనవరి 1948) భారత కార్మిక, రాజకీయ నాయకుడు. ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశాడు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి 1978, 1985, 1989, 1994, 2004 లలో వరుసగా గెలిచాడు.[1][2]

పి.జనార్ధనరెడ్డి
పి.జనార్ధనరెడ్డి

పి.జనార్ధనరెడ్


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కార్మిక నాయకుడు

నియోజకవర్గం ఖైరతాబాద్, హైదరాబాదు

వ్యక్తిగత వివరాలు


జననం 1948 జనవరి 12
హైదరాబాదు, తెలంగాణ
మరణం 2007 డిసెంబరు 28 (వయసు 59)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పి. సులోచన
సంతానం గాయత్రి రెడ్డి, అనురాగిణి రెడ్డి, పి. విజయా రెడ్డి, పావని రెడ్డి, పి.విష్ణువర్ధన్ రెడ్డి
నివాసం జూబ్లీ హిల్స్, హైదరాబాదు, భారతదేశం
మతం హిందూ
 
హైదరాబాదు లోని కూకట్‌పల్లి రోడ్డులో పి. జనార్ధనరెడ్డి విగ్రహం
 
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో పి. జనార్ధనరెడ్డి విగ్రహం

పి. జనార్ధన రెడ్డి 1948, జనవరి 12న పాపి రెడ్డి, శివమ్మ దంపతులకు హైదరాబాదులోని దోమలగూడలో జన్మించాడు. పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందాడు. సనత్‌నగర్‌లోని ఎపి ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేశాడు.

సులోచనతో పిజేఆర్ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (పి.విష్ణువర్ధన్ రెడ్డి) , నలుగురు కుమార్తెలు (గాయత్రి రెడ్డి, అనురాగిణి రెడ్డి, విజయారెడ్డి, పావనీ రెడ్డి) ఉన్నారు.

పిజేఆర్ 1967లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు హైదరాబాద్ ఆల్విన్, కేశవ్రామ్ సిమెంట్స్, ఎన్టిపిసి, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వంటి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించాడు. అసోసియేటెడ్ గ్లాస్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్, ఎపి ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, ఎపి అగ్రో ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్, కృషి ఇంజిన్‌లకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

1978లో ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అదే నియోజకవర్గం నుండి మరో నాలుగు సార్లు (1985, 1989, 1994, 2004) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గాలలో ఒకటి. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.

1980లో సహకార, యువజన సేవల మంత్రిగా, 1982లో ఆర్కైవ్స్ మంత్రిగా, 1990 నుండి 1992 వరకు కార్మిక, ఉపాధి, గృహనిర్మాణ మంత్రిగా, 1993లో పౌర సరఫరా మంత్రిగా పనిచేశాడు.

1994 - 1999 మధ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నాయకుడిగా ఉన్నాడు. ఎన్‌టి రామారావు, ఎన్‌.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాదు నగరంలో పలు నిరసనలు చేశాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతునిచ్చాడు. తెలంగాణ ప్రాంతానికి న్యాయమైన నిధుల కోసం పోరాడాడు.

పార్టీ సమావేశానికి వెళుతుండగా 2007 డిసెంబరు 28న పిజేఆర్ కు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో దారిలోనే మరణించాడు. తమ నాయకుడికి నివాళులర్పించడానికి వేలాదిమంది ఆయన ఇంటికి వచ్చారు. వేలాది మంది అనుచరులు, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో రాష్ట్ర లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.[3]

పిజేఆర్ మరణం తరువాత కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. పి. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] విజయారెడ్డి 2012లో వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరింది.[5] 2014లో తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్‌లో చేరింది.[6]

పి. జనార్థన్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ జంక్షన్ వద్ద పిజేఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పిజేఆర్ కుమార్తె విజయారెడ్డి ప్రజల సంక్షేమం కోసం 2011లో పిజెఆర్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది.