బెంగాల్ విభజన (1905)


Contributors to Wikimedia projects

Article Images

1905 లో ఆంగ్లేయ అధికారుల పాలనలో ఉన్న బెంగాల్ ప్రెసిడెన్సీ భూభాగాన్ని పునర్వ్యవస్థీకరించారు. దీనిని బెంగాల్ విభజన అని వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతం, హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రాంతం రెండుగా విభజించబడ్డాయి. దీనిని అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ జులై 19, 1905 న ప్రకటించి అక్టోబరు 16, 1905 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఆరేళ్ళ తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది.

పశ్చిమ బెంగాల్ లోని హిందువులు తమ ప్రావిన్స్ లో బీహారు, ఒరిస్సా కలిసే ఉంటాయి కాబట్టి తాము మైనారిటీ ప్రజలు అవుతామని, ఇది కుట్రపూరితంగా విభజించి పాలించడమని ఆరోపించారు. కర్జన్ మాత్రం ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమేనని సర్ది చెప్పాలని చూశాడు. ఈ విభజన కారణంగా ముస్లింలు మతం ప్రాతిపదికగా తమ స్వంత జాతీయ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. బెంగాల్ సెంటిమెంట్ ని మెప్పించడం కోసం, విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమంలో భాగంగా అల్లర్లు చెలరేగడం లాంటి కారణాల వలన 1911 లో లార్డ్ హేర్డింగ్ బెంగాల్ ని మళ్ళీ ఏకం చేశాడు.

అప్పటి బెంగాల్ ప్రావిన్స్ లో ప్రస్తుతపు బెంగాల్, బీహార్, చత్తీస్ ఘడ్ లోని కొన్ని ప్రాంతాలు, ఒరిస్సా, అస్సాం లాంటి ప్రాంతాలన్నీ కలిసి ఉండేవి. అందువల్ల ఇది సుమారు 7.85 కోట్ల జనాభాతో అతిపెద్ద ప్రావిన్సుగా ఉండేది. కొన్ని దశాబ్దాలుగా ఆంగ్లేయ అధికారులు ఈ పెద్ద ప్రాంతాన్ని పరిపాలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. దీనివల్ల తూర్పు ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. పరిపాలన నిర్వహణ కోసమే ఈ ఆలోచన చేశారు.

ఆంగ్ల మాధ్యమం చదువుతున్న మధ్యతరగతి బెంగాలీలు ఈ విభజన తమ మాతృభూమిని నిలువునా చీల్చడమే అనీ, తమ ప్రాభవాన్ని తగ్గించడమేననీ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం అమలులోకి రావడానికి 6 నెలలకు ముందు కాంగ్రెస్ పార్టీ, విభజనను వ్యతిరేకించే వారందరి నుంచి వినతి పత్రాలను సేకరించి సంబంధిత అధికారులకు సమర్పించారు. బెంగాల్ కాంగ్రెస్ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ ను విభజించేందుకు బదులుగా బెంగాలీ మాట్లాడని ప్రాంతాలైన ఒరిస్సా, బీహార్ ను ప్రావిన్సు నుంచి బాగుండేదని సలహా ఇచ్చాడు. అయితే లార్డ్ కర్జన్ ఈ సలహాను పట్టించుకోలేదు.