మార్క్ స్పిట్జ్


Contributors to Wikimedia projects

Article Images

మార్క్ స్పిట్జ్

1950, ఫిబ్రవరి 10న అమెరికాలో కాలిఫోర్నియాలోని మోడెస్టోలో జన్మించిన మార్క్ స్పిట్జ్ ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు. 1972లో జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 7 స్వర్ణ పతకాలు సాధించి ఒకే ఒలింపిక్ క్రీడలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన రికార్డు సృష్టించాడు. 1968లో జరిగిన మెక్సికో ఒలింపిక్ క్రీడలలో కూడా మార్క్ స్పిట్జ్ 2 స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్య పతకం సాధించడంతో అతని ఖాతాలో మొత్తం 9 స్వర్ణాలు, ఒక్కొక్కటి చొప్పున రజత, కాంస్య పతకాలు ఉన్నాయి.

మార్క్ స్పిట్జ్

అతను రెండు సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే అతడి కుటుంబం హవాయికి పయనమైంది అక్కడే స్పిట్జ్ ఈతకొట్టడం నేర్చుకున్నాడు. మరో నాలుగేళ్ళ తరువాత కుటుంబం కాలిఫోర్నియాలోని సాక్రమెంటోకు తిరిగివచ్చింది. అక్కడ స్పిట్జ్ స్విమ్మింగ్ క్లబ్‌లో చేరినాడు. 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆర్డెన్ హిల్స్ స్విమ్మింగ్ క్లబ్‌లో శిక్షణ పొందినాడు. అక్కడ శిక్షణ ఇచ్చిన కోచ్ ద్వారా మార్క్ స్పిడ్జ్ కాకుండా మరో ఆరుగురు ఒలింపిక్ క్రీడలలో బంగారు పతకాలను సాధించడం విశేషం.

1968లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 6 స్వర్ణాలు సాధించాలని కలలు కన్ననూ అతనికి లభించినవి రెండు స్వర్ణాలు మాత్రమే. అవి కూడా 4 x 100 మీటర్ల ఫ్రీస్టైల్, 4 x 200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో సాధించిన టీం స్వర్ణాలు. దీంతో బాటు స్పిట్జ్ వ్యక్తిగతంగా 100 మీతర్ల బట్టర్‌ఫ్లైలో రజత పతకం, 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం పొందినాడు.

మెక్సికో ఒలింపిక్ క్రీడలలో అనుకున్న విధంగా పతకాలు సాధించకున్ననూ నిరాశపడక మరింత కఠోర శిక్షణ పొంది తదుపరి ఒలింపిక్ క్రీడలపై దృష్టి పెట్టినాడు. జర్మనీ లోని మ్యూనిచ్‌లో జరిగిన 1972 ఒలింపిక్ క్రీడలలో మార్క్ స్పిడ్జ్ అనుకున్న విధంగా మొత్తం 6 ఈవెంట్లలోనూ బంగారు పతకాలు సాధించడమే కాకుండా మరో పతకం అదనంగా సాధించి ఒలింపిక్ క్రీడా చరిత్రలోనే ఎవరికీ అందనంతా ఎత్తుకు చేరినాడు. చేపపిల్లలా ఈదుతూ ప్రతి ఈవెంట్లలోనూ ప్రథమ స్థానంలో నిలిచి చూపురులను ఆకట్టుకున్నాడు. సహచరులచే మార్క్ ది షార్క్ అని పిలువబడ్డాడు. 1972లో స్పిట్జ్ సాధించిన ఒకే ఒలింపిక్స్‌లో 7 స్వర్ణాల రికార్డు నేటికీ నిలిచి ఉండుట విశేషం.

క్ర.సం.
ఒలింపిక్స్
పతకం
ఈవెంట్
1 1968 మెక్సికో ఒలింపిక్స్ స్వర్ణ పతకం 4x100 ఫ్రీస్టైల్ రిలే
2 1968 మెక్సికో ఒలింపిక్స్ స్వర్ణ పతకం 4x200 ఫ్రీస్టైల్ రిలే
3 1968 మెక్సికో ఒలింపిక్స్ రజత పతకం 100 మీటర్ల బట్టర్‌ఫ్లై
4 1968 మెక్సికో ఒలింపిక్స్ కాంస్య పతకం 100 మీటర్ల ఫ్రీస్టైల్
5 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ స్వర్ణ పతకం 100 మీటర్ల బట్టర్‌ఫ్లై
6 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ స్వర్ణ పతకం 100 మీటర్ల ఫ్రీస్టైల్
7 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ స్వర్ణ పతకం 200 మీటర్ల బట్టర్‌ఫ్లై
8 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ స్వర్ణ పతకం 200 మీటర్ల ఫ్రీస్టైల్
9 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ స్వర్ణ పతకం 4x100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే
10 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ స్వర్ణ పతకం 4x100 మెడ్లే రిలే
11 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ స్వర్ణ పతకం 4x200 ఫ్రీస్టైల్ రిలే