మైదవోలు నరసింహం


Contributors to Wikimedia projects

Article Images

మైదవోలు నరసింహం

భారతీయ ఆర్థికవేత్త

మైదవోలు నరసింహం, భారతీయ ఆర్థికవేత్త, పదమూడవ రిజర్వ్ బ్యాంకు గవర్నరు, పద్మవిభూషణ పురస్కార గ్రహీత.

మైదవోలు నరసింహం

నరసింహం జూన్ 3, 1927 న బెంగుళూరులో శేషాచలపతి, పద్మావతి దంపతులకు జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో, కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కళాశాలలో సాగింది.[1] రిజర్వ్ బ్యాంకులో అదనపు కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత 1977లో రిజర్వ్ బ్యాంకు యొక్క గవర్నరుగా పనిచేశాడు. రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులలో ఆ బ్యాంకు యొక్క గవర్నరుగా నియమించబడిన తొలి వ్యక్తి, ఏకైక వ్యక్తి నరసింహమే. ఈయన రిజర్వ్ బ్యాంకు యొక్క ఆర్థిక విభాగంలో పరిశోధనా అధికారిగా పనిచేశాడు.[2] ఆ తరువాత భారత ప్రభుత్వంలో చేరి, ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేశాడు.

రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా ఈయన పదవీ కాలం ఏడు నెలలే. ఆ తరువాత నరసింహం ప్రపంచ బ్యాంకులో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా, తదనంతరం అంతర్జాతీయ ద్రవ్యనిధిలో దక్షిణాసియా విభాగపు అధ్యక్షునిగా, భారత ప్రభుత్వంలో ఆర్థికశాఖలో కార్యదర్శిగానూ పనిచేశాడు. ఈయన 1991లో విత్త వ్యవస్థపై వేసిన మొదటి నరసింహం సంఘానికి, 1998లో బ్యాంకింగు రంగపు సంస్కరణలపై వేసిన రెండవ నరసింహం సంఘానికి అధ్యక్షత వహించాడు. భారత ప్రభుత్వం ఈయనను 2000 సంవత్సరంలో పద్మవిభూషణ పురస్కారంతో సత్కరించింది.

ఈయన భార్య పేరు శాంతి సుందరేశన్. వీరికి ఒక కుమారుడు.