రత్నమాల (సినిమా)


Contributors to Wikimedia projects

Article Images

రత్నమాల సినిమా భానుమతి, ఆమె భర్త పి.ఎస్.రామకృష్ణారావు స్థాపించిన భరణీ పిక్చర్స్ వారి తొలి చిత్రం. 1948లో రత్నమాల చలనచిత్రం విడుదలైంది.

రత్నమాల
(1948 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం భానుమతి,
చిలకలపూడి సీతారామంజనేయులు,
గోవిందరాజులు సుబ్బారావు,
డి.హేమలతాదేవి,
ఆరణి సత్యనారాయణ,
సీతారాం,
అక్కినేని నాగేశ్వరరావు
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
నృత్యాలు వేదాంతం రాఘవయ్య
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
విడుదల తేదీ 02.01. 1948
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సినిమాలో కథానాయిక ఒక రాజకుమార్తె, పదహారేళ్ల పిల్ల, హీరో పదహారు నెలల బిడ్డ. ఆ బిడ్డ చిరంజీవి కావాలంటే పదహారేళ్ల పిల్లకిచ్చి పెళ్ళిచేయాలని పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞ. ప్రభుభక్తి పరాయణుడైన మంత్రి రాజ్యానికి వారసుడు, వంశోద్ధారకుడు చిరంజీవిగా వుండాలనే ఉద్దేశంతో తన కుమారుడి చిత్రపటాన్ని రాజకుమార్తె రత్నమాలకు పంపిస్తాడు. అందులో వున్నది రాజకుమారుడని చెబుతూ పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్లి సమయంలో కత్తికి బాసికం కట్టి పెళ్లి చేయాలని అది రాజుల వంశాచారమని చెప్పి మోసంచేస్తారు. వివాహమైన తర్వాత శోభనం గదిలో ఊయలలో వున్న బిడ్డను చూసి రత్నమాల దిగ్భ్రాంతి చెందుతుంది. అప్పుడు మంత్రి కుమారుడు వచ్చి జరిగినదంతా చెప్పి ఆ బిడ్డనే భర్తగా స్వీకరించమని కోరి, ఆ మోసంలో తనకూ భాగం వున్నందున కాళ్ళమీదపడి క్షమాపణ కోరతాడు. ఆరాత్రే రత్నమాల ఆ బిడ్డ భర్తను తీసుకొని రాజప్రాసాదాన్ని విడిచిపెట్టి అడవి దారిపడుతుంది. ఎన్నెన్నో అపనిందలకు గురవుతుంది. రత్నమాల శీలాన్ని, సహనాన్ని మెచ్చుకున్న పార్వతీపరమేశ్వరులు క్లైమాక్స్ లో ఆమె ముందు ప్రత్యక్షమై, ఆ బిడ్డను యువకుడిగా మార్చి పెళ్లి జరిపించి, దీవిస్తారు. ఈ కథను భానుమతి రామకృష్ణకు ఆమె అమ్మగారు చెప్పిన వ్రతకథల్లో బాగా జ్ఞాపకం వున్న ఒకానొక కథగా పేర్కొన్నారు.[1]

సినిమా కథలో మానవ బంధాల విషయంలో చేసిన పొరపాట్ల వల్ల సినిమా పత్రికల విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కథానాయికను చిన్నతనం నుంచి అమ్మా, అమ్మా అంటూ పిలిచిన పిల్లాడికే ఇచ్చి పెళ్లిచేసే సన్నివేశాలు రావడాన్ని కొందరు విమర్శకులు వ్యతిరేకించారు.[2]

 
చందమామ 1948 సంచికలోని రత్నమాల ప్రకటన.
ఓరందగాడా పాట
  1. ఆనందదాయినీ భవానీ నటరాజ మనోమోహిని పరామానంద - పి. భానుమతి
  2. ఆయే గౌరీ పరమేశుల దరిసెనమాయె - ఘంటసాల, పి.భానుమతి
  3. ఓరందకాడా ఓబలేశా నన్నుచూసి నవ్వబోకోయి నన్నుచూసి - ఘంటసాల బృందం
  4. ఓహొ నా ప్రేమధారా జీవనతారా - ఘంటసాల, పి.భానుమతి
  5. నను కనక నా జాడ తెలియక .. దారి తెలియదాయే అమ్మా - బేబి సరోజిని
  6. పోయిరా మాయమ్మా పోయిరా - పి.భానుమతి, కె.జమునారాణి, సి. ఎస్.ఆర్.ఆంజనేయులు బృందం
  7. వగలాడి నిను చేరురా మా సామి వగలాడి నిను చేరురా - కె.జమునారాణి
  8. హాయి హాయి చందమామ దాయి.. లాలలు బోసి జోల పాడినా - పి. భానుమతి
  1. భానుమతీ రామకృష్ణ, నాలో నేను, శ్రీ మానస పబ్లికేషన్స్, విజయవాడ, 2000, పేజీ 172.
  2. గిద్దలూరి, గోపాలరావు (1 జూన్ 1948). "ఇవేనా మన సినిమాలు?". రూపవాణి. No. 4. Archived from the original on 21 మే 2015. Retrieved 24 July 2015.