వృద్ధాప్యం


Contributors to Wikimedia projects

Article Images

వృద్దాప్యము లేదా ముసలితనము (ఆంగ్లం: Old age) మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము రోగనిరోధక శక్తిని క్రమక్రమముగా కోల్పోయి చివరకు మరణించే స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను, వ్యాధులను పరిశోధించే విభాగాన్ని జీరియాట్రిక్స్ (Geriatrics) అంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 21న జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు.[1]

మొదటి ప్రపంచ యుద్ధములో పోరాడి ఇంకా జీవించియున్న హ్యరీ పాచ్ (103 years) అనే సైనికుడు వృద్దాప్యములో ఉన్న చిత్రం.
 
ముసలి వ్యక్తి చిత్రపటం

ఈ వయసులో వీరు సంతోష ప్రధాన జీవితము కోరుకొంటారు. ఒంటరితనం వీరిని ఎక్కువగా బాధిస్తుంది.

చాలామంది ఈ వయస్సులో మానసిక సమతుల్యతను కోల్పోతారు. వీరిని పసిపాపలవలె చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది.

 
ఇంగ్లాండుకు చెందిన ఒక వృద్దురాలు.

వృద్దాప్యంలో అనేక సమస్యలు బాధిస్తాయి. వీటిలో కొన్ని...

వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిన్ లోపమూ కారణం అవుతుండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిన్‌ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడటం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణాలుగానే చాలామంది పొరపడుతుంటారు.

మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది.

ఆహారం పదార్థాల్లో కేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిన్ లభిస్తుంది. చేపలు, షెల్‌ఫిష్‌లో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు, చికెన్‌లో కాస్త తక్కువ. మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిన్ ప్రోటీన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేలా చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండ వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవటం తప్పనిసరని నిపుణులు చెబుతారు.

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (21 August 2019). "ఆ వయసులో ఆదరించాలి". www.andhrajyothy.com. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.