సెంగోల్ (దండము)


Contributors to Wikimedia projects

Article Images

సెంగోల్ (దండము)

సెంగోల్ భారతదేశంలోని పురాతన బంగారు రాజదండం.

సెంగోల్ భారతదేశంలోని పురాతన బంగారు రాజదండం. దీనిని చోళ రాజులు రాజరిక అధికార మార్పిడికి చిహ్నంగా వాడేవారు. సెంగోల్ అనే తమిళ పదం "సెమ్మై" నుండి వచ్చింది, దీని అర్థం ధర్మం. ఇది బ్రిటీష్ పాలన నుండి విముక్తి, స్వతంత్ర భారతదేశానికి అధికార బదిలీకి ప్రతీకగా స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించబడింది.[1]

ఆంధ్ర పత్రికలో జవహర్‌లాల్ నెహ్రూకు 'సెంగోల్' బహూకరిస్తున్న ప్రస్తావన.
సెంగోల్ (దండము)

సెంగోల్ అనేది బంగారు పూతతో కూడిన రాజదండం, దాదాపు 5 అడుగుల (1.5 మీ) పొడవు వెండితో చేసిన దండం. సెంగోల్ తయారీకి 800 గ్రాముల (1.8 పౌండ్లు) బంగారాన్ని ఉపయోగించారు. ఇది క్లిష్టమైన డిజైన్‌లతో చేయబడింది, దీని పైభాగంలో నంది చెక్కబడి ఉంటుంది.[2]

చోళ రాజవంశ సంప్రదాయం ప్రకారం, తమిళంలో సెంగోల్ అని పిలువబడే రాజదండం వారి పట్టాభిషేక సమయంలో రాజ కుటుంబానికి చెందిన కొత్త రాజుకు అప్పగించబడుతుంది. ఈ ఆచారం చోళ రాజవంశం పాలన నుండి ఉద్భవించింది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినపుడు బ్రిటిష్ పాలకులు భారతీయులకు అధికారాన్ని అప్పగించారు. అధికార మార్పిడికి ముందు, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ జవహర్‌లాల్ నెహ్రూను భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే అధికార మార్పిడికి చిహ్నం ఏమిటి అని అడిగాడు? అపుడు నెహ్రూ తమిళనాడుకు చెందిన తోటి కాంగ్రెస్ నాయకుడు అయిన సి. రాజగోపాలాచారితో ఈ సమస్యను చర్చించాడు. అతను తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, తమిళనాడు రాజకుటుంబ సంప్రదాయం గురించి నెహ్రూకు చెప్పి, ఆచారం ప్రకారం రాజకుటుంబంలోని కొత్త రాజుకు పట్టాభిషేకం సమయంలో రాజదండం అప్పగిస్తారు అని చెప్పాడు. రాజగోపాలాచారి బ్రిటీష్ వారి నుండి రాజదండం తీసుకోవాలని నెహ్రూకు సలహా ఇచ్చాడు.[3] నెహ్రు ఆ రాజదండము బాధ్యతని రాజగోపాలాచారికి అప్పగించాడు.

రాజగోపాలాచారి ఆ బాధ్యతను స్వీకరించి, తమిళనాడులోని 'తిరువడుత్తురై అధీనం' మఠాన్ని రాజదండం తయారు చేసేందుకు సంప్రదించాడు. అప్పటి మఠాధిపతి రాజదండం తయారు చేసే పనిని చేపట్టి దాని తయారీని మద్రాసుకు చెందిన నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టికి అప్పగించాడు. అతను ఆ బంగారు దండమును తయారు చేశాడు.[4]

"సెగోల్" రాజదండమును తయారు చేసిన తరువాత, చెట్టి ఆ బంగారు దండమును మఠానికి అప్పగించాడు. మఠానికి చెందిన పురోహితుడు రాజదండాన్ని లార్డ్ మౌంట్ బాటన్‌కు అందజేశాడు. దానిని మౌంట్ బాటన్ నుండి దగ్గర నుండి తీసుకోని 1947 ఆగస్టు 15 అర్ధరాత్రికి పదిహేను నిమిషాల ముందు దానిపై గంగాజలం చల్లి, రాజదండాన్ని నెహ్రూకి అప్పగించారు.[5]

జవహర్‌లాల్ నెహ్రూకి ఇచ్చిన తర్వాత దానిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్ మ్యూజియం నెహ్రూ గ్యాలరీలో ఆ సెంగోల్ ను ఉంచారు. అక్కడి నుండి 28 మే 2023 న కొత్త పార్లమెంట్ భవనానికి మార్చబడుతుంది. దానిని కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్టించాడు.[6][7]