హరీష్ శంకర్


Contributors to Wikimedia projects

Article Images

హరీష్ శంకర్

సినీ దర్శకుడు, రచయిత

హరీష్ శంకర్ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. మిరపకాయ్, గబ్బర్ సింగ్ అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.

హరీష్ శంకర్

జననం1979 మార్చి 31 (వయసు 45)
జాతీయతభారతీయుడు
వృత్తిసినీ రచయిత, దర్శకుడు

హరీష్ శంకర్ కరీంనగర్ జిల్లా, ధర్మపురిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని బాల్యమంతా హైదరాబాదులో ని BHEL లో గడిచింది.[1] కిండర్ గార్టెన్ నుంచి ఎంబీయే దాకా అక్కడే చదివాడు. తండ్రి అక్కడ తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. తండ్రి ప్రోత్సాహం వల్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడు. తండ్రి సినిమా అభిమాని కావడంతో అతన్ని అప్పుడప్పుడూ రామారావు, అమితాబ్ బచ్చన్ సినిమాలకు వెంట తీసుకెళుతుండేవాడు.

భెల్ లో ఆరు పాఠశాలలుంటే అందులో ఉన్న ఒకే తెలుగు మాధ్యమ పాఠశాలలో చదివాడు. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో, పోటీల్లో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి అక్కడ ఉన్న సీతా నిలయం, లలిత కళా మందిరం అనే రెండు నాటక కంపెనీల్లో చేరి బాల నటుడిగా, సహాయ నటుడిగా, కథానాయకుడుగా నటించాడు. ఆ కంపెనీల తరపునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పర్యటించాడు. అన్ని ప్రాంతాల యాసలను ఆకళింపు చేసుకున్నాడు.

నాటక సమాజంలో ఉన్న కొంతమంది శ్రేయోభిలాషుల సలహా మేరకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చేరాలనుకున్నాడు. దానికి కావలసిన ప్రాథమిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత గిరీష్ కర్నాడ్, చారు హాసన్ లాంటి ప్రముఖులు ఇతన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇతని శైలి సినిమాలకు బాగా సరిపోతుందని అందులో ప్రవేశించమని సలహా ఇచ్చారు.

సినిమా రంగంలోకి ప్రవేశించడానికి నిర్ణయించి మొదటగా నిన్నే ఇష్టపడ్డాను సినిమాకి రచనా విభాగంలోను, సహాయ దర్శకుడిగానూ పనిచేశాడు. తరువాత రచయిత కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా పనిచేశాడు. తరువాత ఆటోగ్రాఫ్ సినిమాకు కూడా సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత రాం గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత నిర్మాత ఎం. ఎస్. రాజు అతనికి అవకాశం ఇచ్చాడు కానీ కొన్ని అభిప్రాయ బేధాల వల్ల అందులోంచి బయటకు వచ్చేశాడు. తరువాత పూరీ జగన్నాథ్ తో కలిసి చిరుత, బుజ్జిగాడు సినిమాలకు రచనా సహకారం అందించాడు. తరువాత మళ్ళీ రవితేజ హీరోగా మిరపకాయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అది మంచి విజయం సాధించింది.